నెలాఖరు వరకు లక్ష ఇండ్లు పంపిణీ.. 51 వేల డబుల్ బెడ్రూమ్, 49 వేల ఇందిరమ్మ ఇండ్లు 

నెలాఖరు వరకు లక్ష ఇండ్లు పంపిణీ.. 51 వేల డబుల్ బెడ్రూమ్, 49 వేల ఇందిరమ్మ ఇండ్లు 
  • జూన్​ 2 నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేలా ఏర్పాట్లు 
  • వరుసగా రివ్యూలు చేస్తున్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెలాఖరు వరకు లక్ష ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

గతంలో నిర్మాణం పూర్తయి లేదా పాక్షికంగా పనులు జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 51 వేలు ఉండగా, మరో 50 వేల ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్​2) నాటికి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

‘ప్రజాపాలన’ అప్లికేషన్ల ఆధారంగా..

ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని రోజులుగా రివ్యూలు చేస్తున్నారు. ఈ నెలఖారు కల్లా ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇండ్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా గ్రామసభల ద్వారా పారదర్శకత పాటించాలని సూచించారు.

నిర్మాణం పూర్తవకుంటే ఆర్థికసాయం

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేసిన తర్వాత.. మిగతా పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. హౌసింగ్ ఆఫీసర్లు తనిఖీ చేసి, ఇచ్చే రిపోర్ట్ ను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇక, పనులు పూర్తయిన ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీల పనులు పూర్తి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇండ్లు ఉన్న దగ్గర స్కూల్, చిన్న హాస్పిటల్ ను కూడా ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

వేసవిలోనూ వేగంగా పనులు

సాధారణంగా ఎండల తీవ్రత వల్ల నిర్మాణ పనులు మందగిస్తాయి. కానీ, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఇండ్లను పూర్తి చేయాలని ఆదేశించడంతో వేగంగా జరుగుతున్నాయి. మార్చి చివరి నాటికి 20 వేల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ లో 30 వేల ఇండ్ల పనులు పూర్తయ్యాయని, ఈ నెలలో మరో 30 వేల ఇండ్లు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 3.24  లక్షల ఇండ్లు మంజూరవగా.. 2.73 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం పని వేళలను సర్దుబాటు చేసుకుంటూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులను దశల వారీగా ప్రతి సోమవారం గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.6 వేల కోట్లు చెల్లించింది. వచ్చే నెలలో రెండో దశ ఇండ్లను మంజూరు చేయాలని సర్కారు భావిస్తోంది.